మహిళా ఎస్సై ఎఫెక్ట్...నన్నపనేని మీద కేసు నమోదు 

మహిళా ఎస్సై ఎఫెక్ట్...నన్నపనేని మీద కేసు నమోదు 

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై గుంటూరు జిల్లా మంగళగిరిలో కేసు నమోదైంది.. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై అనురాధ, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద కేసు నమోదైంది. నన్నపనేని, మరియు సత్యవాణి అనే మరో మహిళపై కూడా ఐపీసీ సెక్షన్ 353,506,509 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదయ్యాయి.

చంద్రబాబు నివాసం వద్ద టిడిపి నేతలు పోలీసుల తీరుపై వాగ్వాదానికి దిగిన సందర్భంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నన్నపనేని రాజకుమారి అక్కడే విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐ పై కులం పేరిట నోరు జారి మాట్లాడారని సమాచారం.

అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చిన నన్నపనేని తనతో పాటు మరికొందరు మహిళా నేతలను అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని, ఒక పాత వాహనాన్ని తీసుకొచ్చి బలవంతంగా దానిలోకి ఎక్కించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. ఆ వాహనం దుమ్ము, ధూళితో ఉన్నందున ఆ సమయంలో తమతో ఉన్న మహిళా నేత ఈ వాహనంలోని పరిస్థితిని వివరిస్తూ ''ఏంటమ్మా ఈ బండి ఇలా ఉంది.. దరిద్రంగా..'' అని వ్యాఖ్యానించానని ఆ సమయంలో ఆ వాహనం వెనుకనే ఉన్న మహిళా ఎస్సై ఎవరిని దరిద్రం అంటున్నారంటూ, మాపై కోపం ప్రదర్శిస్తూ, అసందర్భ వ్యాఖ్యానంతో, పరుష పదజాలం వాడిందని నన్నపనేని వివరించారు.