దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే, అనుచరులపై కేసు !

దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే, అనుచరులపై కేసు !

నెల్లూరు జిల్లాకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరుల మీదా పోలీస్ కేసు నమోదైంది. నిన్న రాత్రి కోటంరెడ్డి సహా ఆయన అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ ఆరోపిస్తూ ఆ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం విచారణ చేసి ఈ కేసును త్వరలోనే పూర్తి చేస్తామని వారు చెబుతున్నారు. ఈ దాడి ఘటన గురించి తెలుసుకున్న నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు డోలేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. అయితే వేదాయపాలెంలోని మాగుంట లే అవుట్ లోని ఇంట్లో ఉన్నప్పుడు దాడి జరిగిందని, ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. 

జమీన్ రైతు అనేది ఒక తెలుగు వారపత్రిక, ఈ పత్రిక నెల్లూరు నుండి వెలువడుతోంది. 1928లో ఎన్. వెంకట్రామానాయుడు చేతులమీదుగా ప్రారంభమైన ఈ పత్రిక మొదట జమీందారీ రైతు అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా జమీన్ రైతుగా మారింది. దానికి ప్రస్తుతం డోలేంద్ర ప్రసాద్ సంపాదకుడిగా ఉన్నాడు. గతంలో ఈ పత్రికలో ఆత్రేయ, రావూరి భరద్వాజ, బంగోరె మొదలైన వారు పనిచేశారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన పత్రిక అయినా ఈ పత్రిక రాజకీయ, సామాజిక వార్తలకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలోనే కోటంరెడ్డి మీద ఒక కధనం రాయగా ఆ కధనం రాసినందుకే తన మీద దాడి చేశారనేది డోలేంద్ర ప్రసాద్ ఆరోపణ.