పెద్ద నోట్ల మాయం... మళ్లీ నోట్ల రద్దు రోజులు

పెద్ద నోట్ల మాయం... మళ్లీ నోట్ల రద్దు రోజులు
మళ్లీ నోట్ల రద్దు రోజులు కన్పిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కస్టమర్లను ఖాళీ ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే... కొన్ని రాష్ట్రాల సీఎంలు బాహాటంగా నోట్ల కొరత సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైందని అనుకున్న నోట్ల కొరత ఇప్పుడు జాతీయ సమస్యగా మారింది. పనిచేస్తున్న ఏంటీఎంల నుంచి కేవలం వందల నోట్లు రావడంతో కస్టమర్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాతిక వేలు కూడా ఇవ్వలేని స్థితిలో బ్యాంకులు ఉన్నాయి. రెండు వేల నోట్లు మార్కెట్ నుంచి మాయం అవుతున్నాయి. ఈ ఏడాది చివరి నుంచే ఎన్నికల హడావుడి పెరిగే అవకాశమున్నందున రాజకీయ నాయకులు 2000 నోట్లను దాచి పెడుతున్నారని బ్యాంకర్లు అనుమానిస్తున్నారు. అయితే తాము అకౌంట్ల నుంచి సొమ్ము తీసుకుంటున్నామని... తమ ఖాతాలోని సొమ్ము తీసుకోవడానికి ఇన్ని కష్టాలు పడాలా అంటూ బ్యాంకర్లను కస్టమర్లు నిలదీస్తున్నారు. దేశంలో ఆర్థిక ఎమెర్జన్సీ ఉందా అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. చత్తీస్ ఘడ్‌ సీఎం రమణ్ సింగ్‌ కూడా తమ రాష్ట్రంలో నోట్ల కొరత తీవ్రంగా ఉందని అంగీకరించారు. మరోవైపు రైతులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది. దీని కోసం కూడా సుమారు రూ.40,000 కోట్లు వెంటనే సర్దాల్సి ఉందని బ్యాంకర్లు అంటున్నారు. కానీ నోట్ల సరఫరా అంతంత మాత్రమే ఉండటంతో... రైతులకు ఎలా సొమ్ము చెల్లించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. అనేక రాష్ట్రాల్లో నోట్ల కొరత తీవ్రం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్‌లో దాదాపు ఏటీఎంలు పనిచేయడం లేదనే చెప్పాలి. సమస్య మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్ పీ శుక్లా అంటున్నారు. అనూహ్యంగా అనుకోకుండా వచ్చిన ఈ సమస్య తాత్కాలికమని, ఒక్కసారిగా తలెత్తిన ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హామీ ఇస్తున్నారు. బ్యాంకుల వద్ద తగినంత నగదు ఉందని.. కాని కొన్ని రాష్ట్రాల్లో అధికంగా, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నందున...ఈ పరిస్థితి తలెత్తిందని ఆయ అంటున్నారు. రిజర్వు బ్యాంకుతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని... త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2015 నవంబర్ లో ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయి... ఇపుడు ఏంటీఎంలు ఖాళీగా ఉన్నాయి.. కాని భారీ ఎత్తున నోట్లు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని సీపీఎం నేత సీతారం ఏచూరి ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో నోట్ల కొరత తీవ్రంగా ఉంది. రాజధాని భోపాల్ లో గత 15 రోజుల నుంచి క్యాష్ లేదు. తమ రాష్ట్రం నుంచి 2000 రూపాయల నోట్లు మాయాం అవుతున్నాయని రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పేర్కొన్నారు. ఇదొక కుట్రగా ఆయన అనుమానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నోట్ల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి... ప్రభుత్వ పథకాలకు తమ బ్యాంక్ నుంచి నిధులు జారీ అవుతున్నందున నోట్ల కొరత తమ శాఖల్లో అధికంగా ఉన్న మాట నిజమేనని ఎస్బీఐ అధికారులు అంగీకరిస్తున్నారు.