నోట్ల రద్దుకి ముందు కంటే ఎక్కువగా కరెన్సీ సర్కులేషన్

నోట్ల రద్దుకి ముందు కంటే ఎక్కువగా కరెన్సీ సర్కులేషన్

దేశంలో కరెన్సీ సర్కులేషన్ కొత్త రికార్డు నెలకొల్పింది. పెద్దనోట్ల రద్దుకి ముందు కంటే ఎక్కువగా మార్కెట్లోకి నగదు వచ్చింది. దేశంలో కరెన్సీ సర్కులేషన్ (సీఐసీ) 18 జనవరి, 2019న రూ.20.65 లక్షల కోట్ల స్థాయికి చేరింది. పెద్దనోట్ల రద్దుకి ముందు దేశంలో చలామణిలో ఉన్న రూ.17.97 లక్షల కోట్ల కంటే ఇది ఎంతో ఎక్కువ. క్యాష్ సర్కులేషన్ లో పెరుగుదల అనధికార రంగాల్లో మెరుగుదలను సూచిస్తోందని భారత్ లో హెచ్ఎస్ బిసి చీఫ్ ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారీ అన్నారు. 

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాకథనం ప్రకారం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల చెల్లింపులు గాడిన పడతాయని భావించారు. కానీ దీనికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ద్రవ్యీకరణ పురోగతితో పాటు అనధికారం రంగాల్లో మెరుగుదల కనిపించింది. ఈ విషయంలో ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్య క్రాంతి ఘోష్ అభిప్రాయం భిన్నంగా ఉంది. సర్కులేషన్ లో ఉన్న కరెన్సీ అంటే అర్థం ఎక్కువగా నగదునే ఉపయోగిస్తున్నారా అనేది చర్చనీయాంశమని ఆయన అన్నారు. డబ్బు చలామణి వేగం తగ్గింది, దీనర్థం తక్కువ విలువ లావాదేవీలు నగదు రూపంలో చేస్తున్నారని భావించాలని చెప్పారు.

నగదు ప్రవాహం పెరుగుదలను సాధారణ ఎన్నికలతో కూడా ముడిపెట్టి చూడవచ్చు. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తుండగా నగదు ప్రవాహం పెరుగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గర నగదు సాధారణంగానే పెరిగిపోతుందని రాజన్ తెలిపారు. వీటి ద్వారా ఏ కారణాల వల్ల నగదు ప్రవాహం పెరిగిపోతుందో ఊహించవచ్చన్నారు.

కానీ భండారీ మాత్రం కరెన్సీ ఎక్కువగా చలామణి కావడం వెనుక ఎన్నికలు కారణం కాదంటున్నారు. ఎన్నికల్లో నగదు ఉపయోగం నిజమే అయినప్పటికీ అంత ప్రధాన కారణం కాదని చెప్పారు. తరతరాలుగా కరెన్సీ వాడకం గ్రామీణ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోవడమే కారణం కావచ్చని తెలిపారు.