హైదరాబాద్‌ భూములు తాకట్టుపెట్టి..

 హైదరాబాద్‌ భూములు తాకట్టుపెట్టి..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పీఈసీ లిమిటెడ్‌కు రూ.531 కోట్లు ముంచిన రెండు ప్రైవేట్‌ కంపెనీల వ్యవహారం సీబీఐకి చేరింది. ఈ రెండు సంస్థలతోపాటు పీఈసీ మాజీ చైర్మన్‌సహా 13 మందిపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌ నగర శివార్లలోని కొత్వాల్‌గూడ గ్రామకంఠం సహా గ్రామంలోని 1820 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నిటినీ థర్డ్‌ పార్టీ ద్వారా పీఈసీ లిమిటెడ్‌ తాకట్టు పెట్టి ఈ రుణాన్ని ఇచ్చింది. విదేశాలకు ఇనుప ఖనిజం ఎగుమతి చేస్తామంటూ  పీసెస్‌ ఎగ్జిమ్‌ ఇండియా లిమిటెడ్‌, జెట్‌ లింక్‌ ఇన్‌ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు పీఈసీ నుంచి భారీ రుణం తీసుకున్నాయి. ఈ రెండు కంపెనీల ప్రమోటర్లు ఒక్కటే. విదేశీ కంపెనీలకు ఇనుప ఖనిజం ఎగుమతి కోసమని పీఈసీతో ఈ రెండు కంపెనీలు 15 ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. కాని ఇనుప ఖనిజం ఎగుమతి చేయలేదు. పీఈసీకి రుణం కూడా చెల్లించలేదు. రుణం, వడ్డీ కలిపి రూ 531 కోట్లకు చేరినట్లు సీబీఐకి పీఈసీ  ఫిర్యాదు చేసింది. చిత్రమేమిటంటే రుణం ఇచ్చే సమయంలో  పీఈసీకి చెందిన అధికారులు కూడా అవినీతికి పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది.  దీంతో ఈ రెండు కంపెనీల ప్రమోటర్లతో పాటు పీఈసీ మాజీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.