షాదన్‌ మెడికల్‌ కాలేజీపై సీబీఐ కేసు

షాదన్‌ మెడికల్‌ కాలేజీపై సీబీఐ కేసు

విద్యార్థుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)కు చెందిన ఇద్దరు అధికారులకు లంచం ఇచ్చిన కేసులో హైదరాబాద్‌కు చెందిన షాదన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సస్‌ టీచింగ్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచం తీసుకున్న ఎంసీఐ అధికారులు సంతోష్‌ కుమార్‌, సతీష్‌ కుమార్‌తోపాటు ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసిన సుశీల్‌ కుమార్‌ అనే ఓ వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. సంతోష్‌ కుమార్, సుశీల్‌ కుమార్‌లు ఎంసీఐలో ఎల్‌డీసీలుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌, ఢిల్లీలలో నిందితులకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ దాడులు  నిర్వహించింది. 2016-17 ఏడాదికి గాను విద్యార్థుల రిజిస్ర్టేషన్‌ చేసుకునే విషయంలో ఎంసీఐకి చెందిన అధికారులు లంచం ఇవ్వాల్సిందిగా షాదాన్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేయడమే గాక.. వారి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. ఇదే విధంగా ఎంసీఐ వద్ద కొన్ని పనులు చేసి పెట్టి... ఇతర కాలేజీల నుంచి కూడా ఎంసీఐ అధికారులు లంచాలు తీసుకున్నారని సీబీఐ తెలిపింది.