అఖిలేష్‌పై సీబీఐ కేసు?

అఖిలేష్‌పై సీబీఐ కేసు?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌వాదీ (బీఎస్సీ) పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే యూపీలో సీబీఐ విరుచుకుపడుతోంది. యూపీ సీఎంగా అఖిలేష్‌  ఉన్న సమయంలో మైనింగ్‌ స్కామ్‌కు సంబంధించి ఇవాళ 12 ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరుపుతోంది. యూపీలో మైనింగ్‌ స్కామ్‌కు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితునిగా అఖిలేష్‌ పేరు లేకున్నా... ఎఫ్‌ఐఆర్‌లో అఖిలేష్‌ పేరు పలుమార్లు ప్రస్తావించింది సీబీఐ.  2012-13లో యూపీ మైనింగ్‌ శాఖకు ఇంచార్జి మంత్రిగా అఖిలేష్‌ ఉన్నారు. అపుడు అఖిలేష్‌ తోపాటు గాయత్రి ప్రజాపతి మైనింగ్‌ శాఖను నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్‌ కామత్‌ మిశ్రా,  2017లో బీఎస్పీ  అభ్యర్థి సంజయ్‌ దీక్షిత్‌ తోపాటు ఐఏఎస్‌ అధికారి చంద్రలేఖతోపాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది సీబీఐ.

ఇపుడు దాడులా?
2017లో అయిదు ప్రిలిమినరీ ఎఫ్‌ఐఆర్‌లు సిద్ధం చేసిన సీబీఐ... ఇన్నాళ్ళూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావొచ్చని సీబీఐ అధికారులు అంటున్నారు. కొత్త ఎఫ్‌ఐఆర్లలో నేరుగా అఖిలేష్‌ను నిందితునిగా సీబీఐ చేర్చినా  ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. ఎఫ్‌ఐఆర్‌ చివరి లైన్‌లో 'విచారణలో భాగంగా 2012-16 మధ్య కాలంలో అప్పటి మైనింగ్‌ శాఖ మంత్రుల పాత్రపై కూడా విచారణ చేసే అవకాశముంద'ని  సీబీఐ పేర్కొంది.