ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం...?

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం...?

ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది... ఈ కేసులో దోషులు ఎవరు? అనేది ఇంత వరకు తేలలేదు. అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆమె భౌతికకాయానికి రీపోస్టుమార్టం చేయాలని భావిస్తోంది. ఈ నెల 20వ తేదీ లోపు ఈ పని పూర్తి చేయాల్సిందిగా విచారణాధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రేపు అధికారులు తెనాలి వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆయేషా మీరను ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించనున్నారు... 2007 డిసెంబర్ 27వ తేదీన ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సత్యంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, అతడిని హైకోర్టు నిర్ధోషిగా తేల్చింది. దీంతో విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించారు..

ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కోనేరు సతీష్‌ను కూడా విచారించింది సీబీఐ... మరోవైపు కోర్టులో పనిచేసే సిబ్బంది.. ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను మాయం చేశారంటూ వారిని సస్పెండ్ కూడా చేశారు. అయితే, ప్రస్తుతం ఆయేషా మీరా భౌతిక కాయానికి రీపోస్టుమార్టం నిర్వహిస్తే.. కొన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు సీబీఐ అధికారులు.. దీని కోసం రేపు తెనాలి వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులతో సీబీఐ అధికారులు సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అయితే, రేపు తెనాలి వెళ్తారా? లేక ఎల్లుండి వెళ్తారా? అనే దానిపై రేపు క్లారిటీ రానుంది.