కోల్ కతా మాజీ కమిషనర్ అరెస్ట్ కు అనుమతించాలని సుప్రీంలో సీబీఐ అర్జీ

కోల్ కతా మాజీ కమిషనర్ అరెస్ట్ కు అనుమతించాలని సుప్రీంలో సీబీఐ అర్జీ

శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ సుప్రీంకోర్ట్ తలుపు తట్టింది. ఈ వ్యవహారంలో సీబీఐ తాజా పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తులో రాజీవ్ కుమార్ సహకరించడం లేదని ఆరోపించింది. అందువల్ల సుప్రీంకోర్ట్ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని, దానివల్ల ఆయనను ప్రశ్నించడం సులువవుతుందని తెలిపింది. సీబీఐ తన అర్జీలో సిట్ చీఫ్ గా ఉన్నపుడు రాజీవ్ కుమార్ చాలా మంది పెద్ద తలకాయలను రక్షించాడని, కీలక సాక్ష్యాలను ధ్వంసం చేశాడని పేర్కొంది. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీవ్ కుమార్ అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. ఇంతకు ముందు జరిగిన విచారణ సందర్భంగా కోర్ట్ ఆదేశాల మేరకు సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అది పరిశీలించిన తర్వాత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాజీవ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నట్టు రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొందని చెప్పింది.