సీబీఐ బృందంపై దాడి చేసిన పరారీలోని అధికారి కుటుంబం

సీబీఐ బృందంపై దాడి చేసిన పరారీలోని అధికారి కుటుంబం

లంచం తీసుకున్న కేసులో నిందితుడిని అరెస్ట్ చేయబోయిన సీబీఐ బృందం దాడికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో కొందరు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై గ్రేటర్ నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఓ కేసులో ఒక అనుమానితుడి కోసం సీబీఐ బృందం అతని నివాసానికి వెళ్లింది. అతని కుటుంబ సభ్యులు సీబీఐ టీమ్ పై దాడి చేశారు. ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిపై చర్యలు తీసుకుంటామని’ గ్రేటర్ నోయిడా ఎస్పీ వినీత్ కుమార్ సింగ్ తెలిపారు.

సీబీఐ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న సునీల్ దత్ పై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. అతనిని అదుపులోకి తీసుకొనేందుకు ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం గ్రేటర్ నోయిడాలోని సోనెపురా గ్రామానికి వెళ్లింది. నిందితుడైన సీబీఐ అధికారి గ్రేటర్ నోయిడాలోని ఫామ్ హౌస్ లో దాక్కున్నట్టు సమాచారం అందుకున్న సీబీఐ టీమ్ దత్ ను పట్టుకొనేందుకు అక్కడికి వెళ్లింది. అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులు సీబీఐ అధికారులపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతుండగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 

రూ.126 కోట్ల గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వే ల్యాండ్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ అధికారి అయిన దత్ పై అవినీతి కేసు నమోదు చేసింది. ఫిబ్రవరి 2న కేసు పెట్టినప్పటి నుంచి దత్ పరారీలో ఉన్నాడు. ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి సునీల్ దత్ కుట్ర పన్నాడని.. ఇందుకు బదులుగా అక్రమంగా లబ్ధి పొందినట్టు ఆరోపించడం జరిగింది. ‘పరారీలో ఉన్న నిందితుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నట్టు సమాచారం అందడంతో మా బృందం అక్కడికి వెళ్లింది. కానీ దత్ కుటుంబసభ్యులు దాడి చేశారు. ఇంతలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడని’ సీబీఐ అధికారి చెప్పారు.

లంచం కేసులోనే మరో సీబీఐ అధికారి వీఎస్ రాథోడ్, తహసీల్దారు రణ్ వీర్ సింగ్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. దత్ ఒక్కడే పరారీలో ఉన్నాడు.