ఆస్థానా కేసు కొట్టివేతకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్ట్

ఆస్థానా కేసు కొట్టివేతకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్ట్

సీబీఐ నెంబర్ 2 రాకేష్ ఆస్థానాపై నమోదైన లంచం కేసును రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్ట్ తిరస్కరించింది. రాకేష్ ఆస్థానాపై నమోదైన అవినీతి కేసు దర్యాప్తును 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. లంచగొండి, అవినీతిపరుడని ఆరోపిస్తూ తనపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా కోర్టుని ఆశ్రయించారు. ఆస్థానాపై అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన వంటి నేరాలు ఆరోపించారు. ఆస్థానా వినతిని ఢిల్లీ హైకోర్ట్ కి చెందిన జస్టిస్ నజ్మీ వజీరీ తిరస్కరించారు.  

అలాగే సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్, మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోజ్ ప్రసాద్ లపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు కూడా జస్టిస్ నజ్మీ వజీరీ నిరాకరించారు. ఇప్పటి వరకు రాకేష్ ఆస్థానాను అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్థానా, దేవేందర్ కుమార్, మనోజ్ ప్రసాద్ తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ కోర్టుకెళ్లారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై పవర్డ్ కమిటీ సంస్థ నుంచి సాగనంపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.