రామనగర ఎన్నిక వాయిదాకు ఈసీ నిరాకరణ?

రామనగర ఎన్నిక వాయిదాకు ఈసీ నిరాకరణ?

కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ స్థానానికి రేపు జరగాల్సిన ఉపఎన్నికలను రద్దు చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. బీజేపీ అభ్యర్థి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత రోజునే ఈ పరిణామం ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీస్తుందని బీజేపీ వాదించింది. ఇది ఎన్నికల నిర్వహణ తీరును కలుషితం చేస్తుందని పేర్కొంది. కాసేపట్లో బీజేపీ వినతిపై ఈసీ తన నిర్ణయం ప్రకటించవచ్చు. అయితే ప్రజాప్రాతినిథ్య చట్టంలో ఇలాంటి కారణాలపై ఎన్నికలు వాయిదా వేసే నిబంధన ఏదీ లేనందువల్ల రామనగర ఉపఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపించడం లేదు.

ఎలాంటి పోటీ ఉండరాదని ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నందుకు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి నేతలపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కాంగ్రెస్ బెంగుళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్, అనితా కుమారస్వామి, ముఖ్యమంత్రి కలిసి చంద్రశేఖర్ పై అనుచిత ప్రభావం చూపారని.. అందువల్లే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని ఆరోపించింది. దీనిని పరిశీలనకు స్వీకరించిన ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల అధికారిని అడిగి సమాచారం సేకరిస్తోంది. 

రామనగర అసెంబ్లీ ఉపఎన్నికకు రెండు రోజుల ముందు గురువారం బీజేపీ అభ్యర్థి ఎల్. చంద్రశేఖర్ పోటీ నుంచి తప్పుకొని తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో జేడీఎస్ తరఫున బరిలో ఉన్న ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి సునాయాసంగా నెగ్గడానికి మార్గం సుగమమైంది.