హైకోర్టులో ఘనంగా శతాబ్ధి ఉత్సవాలు

హైకోర్టులో ఘనంగా శతాబ్ధి ఉత్సవాలు

తెలంగాణ హైకోర్టులో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. హైకోర్టులాంటి అద్భుతమైన నిర్మాణంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు క్యాంపస్ వాతావరణం న్యాయవాదులకు చాలా అనుకూలంగా ఉంది. వీలైనంత తొందరలో హైకోర్టు పెండింగ్ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సామాన్యులకు న్యాయం అందేలా చూస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు న్యాయవ్యవస్థపై ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. న్యాయవ్యవస్థ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుందని తెలిపారు. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.