24 లక్షల ఉద్యోగాలు ఎపుడు భర్తీ చేస్తారు?

24 లక్షల ఉద్యోగాలు ఎపుడు భర్తీ చేస్తారు?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దేశ వ్యాప్తంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు ఇవ్వడానికి మేం రెడీ.. కాని భర్తీ చేసేందుకు ఉద్యోగాలేవీ అంటూ ఏకంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించి ఒక రోజైనా కాకముందే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల ఖాళీల వివరాలను ప్రకటించింది. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఏకంగా 24 లక్షల ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ ప్రతిక పేర్కొంది. ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒక్క  విద్యా శాఖలోనే పది లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 9 లక్షలు, సెకండీ స్కూళ్ళలో ఏకంగా  లక్షా పది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
పార్లమెంటులో వివిధ సందర్భాల్లో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ప్రభుత్వం వెల్లడించిన సమాచారం మేరకు పోలీస్‌ విభాగంలో 5.4 లక్షలు, రైల్వేలలో  2.4 ల్‌్్షలు, అంగన్ వాడీ వర్కర్స్ ఖాలీలు 2.2 లక్షలు ఉన్నట్లు వెల్లడించింది. ఇంకా హెల్త్‌ సెంటర్లలో 1.5 లక్షలు, ఆర్మోడ్ ఫోర్సస్ లో 62,084 ఉద్యోగాలు, పారా మిలటరీ దళాల్లో 61,509, పోస్టల్ విభాగంలో 54,263 ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. ఇక ఎయిమ్స్ వంటి పెద్ద హాస్పిటల్స్ లో కూడా 21,740 పోస్టులు భర్తీ కాలేదు. ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీల సంఖ్య 12,020 కాగా, కోర్టుల్లో 5,853 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఖాళీల వివరాలను చూస్తే.. భద్రతా దళాలతో పాటు రాష్ట్రాల్లో భర్తీ కాని పోస్టులు లక్షల్లో తేలుతున్నాయి.