స్వార్థ ప్రయోజనంతో కేంద్రంపై ఆరోపణలు

స్వార్థ ప్రయోజనంతో కేంద్రంపై ఆరోపణలు

చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనంతో కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం సాధించాలని విజయవాడలో ఆయన ప్రచారం నిర్వహించారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి 2016 అక్టోబర్‌ 24న చంద్రబాబు రాసిన పలు లేఖలను ఆయన విడుదల చేశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. 2017 టీడీపీ మహానాడులో హోదా వద్దని ప్యాకేజీ కావాలంటూ చేసిన తీర్మానాన్ని ఆయన గుర్తుచేశారు. ప్యాకేజీని స్వాగతిస్తూ 2017 మార్చి 16న ఏపీ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అంశాన్ని గోయల్‌ ప్రస్తావించారు. ఇన్ని కుట్రలు చేసిన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనం కోసం కేంద్రంపై ఆరోపణలను చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమపై నెట్టడానికే కేంద్రం నుంచి బయటకు వచ్చారని వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్‌ జట్టుకడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రుజుమైందని గోయల్‌ అభిప్రాయపడ్డారు.