నేడు కేంద్రం, రైతుల మధ్య మరోసారి చర్చలు..

నేడు కేంద్రం, రైతుల మధ్య మరోసారి చర్చలు..

ఓవైపు రైతన్నల సుదీర్ఘ పోరాటం కొనసాగుతూనే ఉంది.. కొత్త వ్యసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఎనిమిది విడతలుగా జరిపిన చర్చలు విఫలం కాగా.. తొమ్మిదో దఫా చర్చలు జరిపేందుకు సిద్ధమైంది కేంద్రం.. ఇవాళ రైతులు, ప్రభుత్వం మధ్య తొమ్మిదో విడత చర్చలు జరగనున్నాయి.. మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రులు.. సాగు చట్టాల రద్దు, విద్యుత్ విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు.. మరోవైపు.. కేంద్ర వ్యవ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు విష‌య‌మై ఇవాళ జ‌రిగే తొమ్మిదో విడుత చ‌ర్చల్లో చెప్పుకోద‌గిన పురోగ‌తి ఉంటుంద‌ని త‌మ‌కు ఆశ‌లు లేవ‌ని చెప్పారు రైతు సంఘాల నేత‌లు. ఈ అంశంపై కేంద్రంతో జ‌రిగే చ‌ర్చ‌లు చివ‌రివ‌ని సంకేతాలందుతున్నాయన్నారు. కేంద్ర చ‌ట్టాల‌ను ప‌రిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ తొలి స‌మావేశం ఈ నెల 19న జ‌రుగ‌నుంది. నేడు జ‌రిగే చ‌ర్చ‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై సుప్రీంకోర్టు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తిని గుర్తు చేస్తుంద‌న్నారు రైతు సంఘం నేతలు. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వానికి మంచి ఆలోచ‌నే లేద‌ని అన్నారు. 

మరోవైపు.. సాగు చట్టాలపై వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. నిరసన తెలుపుతున్న రైతులతో చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి.. ఒక సభ్యుడు భూపీందర్ సింగ్ మాన్ తప్పుకొన్నారు. తాను నిష్పక్షపాతంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. తనను ఈ కమిటీలో నియమించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన భూపీందర్‌... రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై రైతుల నిరసన తీవ్రతరం కావడంతో.. సుప్రీంకోర్టు మంగళవారం ఈ చట్టాల అమలుపై స్టే విధించింది. నలుగురు వ్యవసాయ రంగ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అగ్రికల్చరల్ ఎకనమిస్ట్ అశోక్ గులాటీ, భారతీయ కిసాన్ యూనియన్-మాన్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మాన్, షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రమోద్ కుమార్‌ జోషీలను సభ్యులుగా నియమించింది. అయితే,  ఈ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్టు భూపీందర్ సింగ్ మాన్.. ప్రకటించడం సంచలనం రేపింది. స్వయంగా తాను రైతునని.. రైతు సంఘం నాయకుడినని చెప్పారు. రైతు సంఘాలు, ప్రజల్లో ఏర్పడిన భయాలు, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పంజాబ్‌తోపాటు దేశంలోని రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోనన్న భూపీందర్‌.. ఎలాంటి స్థాయినైనా త్యాగం చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఎల్లప్పుడూ రైతులతోనూ, పంజాబ్‌తోనూ నిలుస్తానని పేర్కొన్నారు.