పుల్వామా ఘటనలో ఇంటలిజెన్స్ వైఫల్యం లేదు

పుల్వామా ఘటనలో ఇంటలిజెన్స్ వైఫల్యం లేదు

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి విషయంలో ఇంటిలిజెన్స్‌ వైఫల్యం ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  దేశ భద్రత కోసం ఇంటిలిజెన్స్‌, భద్రతా సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో అనేక మంది ఉద్రవాదులను భారత బలగాలు హతమార్చాయని ఆయన గుర్తుచేశారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే ఏ మహ్మద్‌ స్థావరాలపై దాడులు చేసి.. ప్రతీకార చర్యలను కూడా చేపట్టామన్నారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉగ్రముప్పు కారణంగా జమ్ము కాశ్మీర్‌ ప్రభావితం అవుతోందని అన్నారు. 

ఉగ్రవాదం ఈ నాటి సమస్య కాదని గత ముప్ఫై ఏళ్ల నుంచి రగులుతూనే ఉందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌ ఉగ్రవాదం మీద దండెత్తుతోందని,  ఉగ్రవాదాన్ని అణిచి వేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని అన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన పుల్వామా ఘటనపై ఎన్‌ఐఏ విచారణ చేస్తోందని పేర్కొన్నారు. ఆ ఘటనకు కారకులైన వారిని గుర్తించడంలో మన ఇంటెలిజెన్స్‌ విభాగం చురుకుగా పనిచేసిందని స్పష్టం చేశారు. పుల్వామా ఘటనలో ఇంటెలిజెన్స్‌ వైఫల్యం ఎంతమాత్రం లేదని తెలిపారు. ఉగ్రవాదుల కుట్ర కారణంగానే ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారని వెల్లడించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 26న పాక్‌ సరిహద్దులోని బాలాకోట్‌పై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేపట్టినట్లు కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.