అందరి చూపు అవిశ్వాసం వైపు...

అందరి చూపు అవిశ్వాసం వైపు...

అందరి చూపు పార్లమెంట్ సమావేశాలవైపే ఉంది... ముఖ్యంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ గురించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి కొన్ని పార్టీలు మద్దతుగా ప్రకటించగా... మరికొన్ని పార్టీలు చర్చలో పాల్గొన్నా... ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతుంటే... కౌంటర్‌ ఇవ్వడానికి అధికారపక్షం సన్నద్ధమవుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోకసభ సమావేశం కాగానే “అవిశ్వాస తీర్మానం” పై చర్చకు అంగీకరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టమని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరతారు. సభలో “అవిశ్వాస తీర్మానం” ప్రవేశపెట్టిన తర్వాత గల్లా జయదేవ్ చర్చను ప్రారంభిస్తారు. 

సాధారణంగా “అవిశ్వాస తీర్మానం” ప్రవేశ పెట్టిన సభ్యుడు 15 నిమిషాల నుంచి అరగంట వరకు ప్రసంగిస్తారు... “అవిశ్వాస తీర్మానం” ప్రవేశపెట్టాడనికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ, ఏపీ విభజన చట్టంలోని అంశాలు, విభజన హామీలను ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వం ఏరకంగా తోడ్పాటును అందించలేదో గల్లా జయదేవ్ వివరిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 7 గంటలు “అవిశ్వాస తీర్మానం” పై చర్చకు స్పీకర్‌ సమయాన్ని కేటాయుంచినప్పటికీ, సభలో నెలకొన్న పరిస్థితి, “మూడ్” ను బట్టి స్పీకర్‌ మరింత సమయాన్ని పొడిగించే అవకాశం ఉంది. అన్ని పార్టీలకు చెందిన సభ్యులు చర్చలో పాల్గొని మాట్లాడడం పూర్తయిన తర్వాత చివర్లో ప్రధాని మోడీ సమాధానం ఇస్తారు. “అవిశ్వాస తీర్మానం పై ప్రధానమంత్రి సుదీర్ఘ సమాధానం, వివరణ ఇచ్చేందుకు సుమారు గంట సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని సమాధానం పూర్తయిన తర్వాత తిరిగి చివరగా “ అవిశ్వాస తీర్మానం” ప్రవేశపెట్టిన గల్లా జయదేవ్ మరోసారి మాట్లాడుతారు. ప్రధాని సమాధానానికి గల్లా జయదేవ్ చివరగా మరో 10 నిముషాలు మాట్లాడతారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది.

మాట్లాడేందుకు కేటాయించిన సమయం సరిపోదని సభ్యులు గట్టిగా విజ్ఞప్తి చేస్తే స్పీకరు చర్చను కొనసాగిస్తూ కేటాయించిన సమయాన్ని మరింతగా పొడిగించే అవకాశం ఉంది... స్పీకర్‌ సమయాన్ని పొడిగిస్తే... రాత్రి 9 గంటల వరకు సభ జరిగే అవకాశం ఉంది. ఇక టీడీపీ నుంచి రెండవ స్పీకర్‌గా రామమోహన్ నాయుడు మాట్లాడతారు. సమయం ఉంటే, అవకాశం వస్తే కేశినేని నాని, తోట నరసింహం కూడా మాట్లాడవచ్చు. లోకసభ లో “అవిశ్వాస తీర్మానం” పై జరిగే చర్చను ప్రత్యక్షంగా చూసేందుకు రాజ్యసభ సభ్యులు కూడా వారికి కేటాయించిన గ్యాలరీకి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.