స్కూలుబ్యాగుల బరువు 1.5-5 కిలోలే ఉండాలి

స్కూలుబ్యాగుల బరువు 1.5-5 కిలోలే ఉండాలి

స్కూళ్లలో పిల్లల వీపులపై బస్తాల బరువు చాలా కాలంగా పెద్ద సమస్యగా ఉంది. బరువుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తే పిల్లల ఆరోగ్యరీత్యా ఇది మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. తరచుగా సంబంధిత శాఖలు బస్తా బరువు తగ్గించాలని ఆదేశిస్తూనే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం మద్రాస్ హైకోర్ట్ పిల్లల వీలుపై బస్తాల బరువు తగ్గించాలని.. మొదటి, రెండో తరగతి వరకు పిల్లలకు హోమ్ వర్క్ ఇవ్వరాదని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి పిల్లల స్కూల్ బ్యాగుల బరువు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం దీనిపై మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఇక ప్రతి పాఠశాలలో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను తప్పనిసరి చేయాలని తాజా సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కింద పనిచేసే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషణ్‌ అండ్‌ లిటరసీ.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బోధన, స్కూలు బ్యాగుల బరువుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అదనపు పుస్తకాలు, ఇతర మెటీరియల్ తీసుకురావాల్సిందిగా పిల్లలని ఒత్తిడి చేయొద్దని, స్కూలు బ్యాగుల బరువు పరిమితి కూడా తమ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలని విడుదల చేసిన సర్క్యులర్‌లో మార్గదర్శకాలు ప్రకటించింది. తరగతులకు తగ్గట్టు బ్యాగుల భారం ఉండాలని కనిష్టంగా కేజీన్నర గరిష్ఠంగా 5 కేజీలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. 

ఒకటి, రెండో తరగతి విద్యార్థుల స్కూలు బ్యాగు బరువు గరిష్ఠంగా 1.5 కిలోలు, 3-5 తరగతి వరకు 2-3 కిలోలు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదో తరగతి విద్యార్థులకు 5 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండరాదని ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది. ఒకటి, రెండు తరగతులకు హోమ్‌వర్క్‌ ఉండకూడదని స్పష్టం చేసింది. క్లాస్ 1, 2 విద్యార్థులకు భాష, గణితం తప్ప మరేమీ బోధించరాదు. 3-5 తరగతుల్లో భాష, ఈవీఎస్, గణితం ఉండాలని చెప్పారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా విద్యార్ధులపై పుస్తకాల భారాన్ని తగ్గించాలని మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్‌ అన్నారు.