శతాబ్దపు సుదీర్ఘ 'బ్లడ్ మూన్'

శతాబ్దపు సుదీర్ఘ 'బ్లడ్ మూన్'

ఖగోళంలో మరో అద్భుతం జరగనుంది... జులై 27న ఆకాశంలో అరుదైన 'అరుణ వర్ణ చందమామ (బ్లడ్ మూన్)' కనువిందు చేయనుంది. 103 నిమిషాల పాటు అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం చరిత్రలో నిలిచిపోనుంది. భూ వాతావరణం ప్రభావంతో వక్రీభవనం చెందిన సూర్యకాంతి ప్రకాశింపచేయడంతో సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలో కనిపించనున్నాడు. 27న రాత్రి 10.40 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం 28న తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగుతుంది. భారత్‌లో 11.54 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం అవుతుందంటున్నారు. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కనుమరుగు కాకుండా... భూ వాతావరణంపై ప్రసరించే సూర్యకాంతి వల్ల ఎరుపు రంగును సంతరించుకోనున్నాడు అంటోంది కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్.

అయితే ఈ బ్లడ్ మూన్ ప్రపంచంలోని తూర్పు అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తోంది అంటున్నారు కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేబీప్రసాద్ డూరి... యూరోప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆసియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రజలు ఉదయం వేళలో,  ఐరోపా, ఆఫ్రికా ప్రజలు సాయంత్రం వేళలో గ్రహణ దృశ్యాన్ని వీక్షించవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం గంటా 43 నిమిషాల పాటు కొనసాగనుండగా... సంపూర్ణ చంద్రగ్రహణనానికి ముందు, ఆ తర్వాత పాక్షిక గ్రహణాలు ఏర్పడుతాయని... అవి గంటపాటు ఉంటాయని వెల్లడించారు.