ప్రతీ బీజేపీ కార్యకర్త కోరిక ఒక్కటే.. విద్యాసాగర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు..!

 ప్రతీ బీజేపీ కార్యకర్త కోరిక ఒక్కటే.. విద్యాసాగర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు... వికారాబాద్ అనంతగిరిలోని శ్రీఅనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.. భారతీయ జనతాపార్టీ ప్రతీ కార్యకర్త కోరిక ఒక్కటే చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా కప్పాలనే కోరిక... అందుకే నేను తిరిగి పార్టీలో సభ్యత్వం తీసుకున్నానన్నారు. ఇక, బీజేపీకి రెండు సీట్లు ఉండడం శుభపరిమాణం.. గతంలో రెండు సీట్లతోనే దేశంలో నేడు అధికారంలోకీ వచ్చామని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు రాష్ట్రంలో మాకు రెండు సీట్లు ఉన్నా.. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకున్నకంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేస్తున్నాడని.. ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారంలోకీ వచ్చితీరుతామన్నారు విద్యాసాగర్ రావు. కాగా, వాజ్‌పేయి సర్కార్‌లో కేంద్ర మంత్రిగా పనిచేసిన విద్యాసాగర్‌ రావు.. మోడీ ప్రధాని అయ్యాక.. గవర్నర్‌గా నియమితులు అయ్యారు. ఆ పదవి కాలం కూడా ముగియడంతో.. కొంతకాలం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత మళ్లీ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.