హుజూర్‌నగర్‌ బైపోల్.. పొత్తులపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..

హుజూర్‌నగర్‌ బైపోల్.. పొత్తులపై ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..

హూజూర్‌నగర్ ఉప ఎన్నికల మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతుపై పునరాలోచనలో పడింది సీపీఐ.. సెల్ఫ్ డిస్మిస్ అని పిచ్చోడి కూడా మాట్లాడడని.. సమ్మె చట్ట విరుద్ధమనడం సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడని మండిపడ్డారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చాడా వెంకట్‌రెడ్డి... ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఉందని.. సెల్ఫ్‌ డిస్మిస్‌ను కేసీఆర్ విత్‌డ్రా చేసుకోవాలని హితవుపలికారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై సమీక్షించుకుంటామని తెలిపారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇస్తే అది చట్ట విరుద్ధమని అంటారా అంటూ కేసీఆర్‌పై మండిపడ్డ చాడా వెంకట్‌రెడ్డి... ఆ నాడు అందరూ కలిసి సకలజనుల సమ్మెలు, మిలియన్ మార్చి.. ఇలా ఎన్నో ఆందోళనలు చేస్తేనే కదా.. ఉద్యమాల్లో పాల్గొంటేనే కదా తెలంగాణ వచ్చింది అని గుర్తు చేశారు. ఆ విషయం మర్చి నియంతృత్వ వైఖరితో కేసీఆర్‌ వెళ్తున్నారని.. వెంటనే ఆర్టీసీ కార్మికుల విషయంలో తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.