టీమిండియాలో మరో అన్నదమ్ముల జోడీ..!

టీమిండియాలో మరో అన్నదమ్ముల జోడీ..!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో మంది 'బ్రదర్స్‌' ఒకే జట్టుకు కలిసి ఆడారు. ఆస్ట్రేలియాకు వా బ్రదర్స్, జింబాబ్వేకు ఫ్లవర్ బ్రదర్స్, ఇంగ్లండ్‌కు హోలియేక్‌ బ్రదర్స్‌ ఆడారు. మన భారత జట్టులోనూ అన్నదమ్ములు ఒకేసారి ఆడిన సందర్భాలు ఉన్నాయి. మొహిందర్, సురిందర్ అమర్‌నాథ్ బ్రదర్స్‌.. ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్ బ్రదర్స్‌.. హార్ధిక్‌, కృనాల్‌ పాండ్యా బ్రదర్స్ భారత జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. ఇప్పుడు మరో అన్నదమ్ముల జోడీ జాతీయ జట్టుకు ఎంపికైంది. 

వెస్టిండీస్‌ టూర్‌కు దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌లు ఎంపికయ్యారు. వీరిద్దరూ కజిన్‌ బ్రదర్స్‌. దీపక్‌ ఇప్పటికే టీమిండియా తరఫున మ్యాచులాడగా.. రాహుల్‌ మాత్రం జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. ఈ ఐపీఎల్‌లో మంబై ఇండియన్స్‌ తరఫున సత్తాచాటిన రాహుల్‌కు సెలెక్టర్లు తొలి సారి బిగ్‌ స్టేజ్‌లో అవకాశం ఇచ్చారు.  ఇప్పటి వరకూ 14 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులాడిన రాహుల్.. 26.44 సగటుతో 63 వికెట్లు పడగొట్టాడు.  
వెస్టిండీస్‌తో తలపడే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న చాహర్‌ బ్రదర్స్‌.. ప్లేయింగ్‌ లెవెన్‌లోనూ చోటు దక్కించుకుంటే అది మరో రికార్డు. వెస్టిండీస్‌ పర్యటన ఆగస్టు 3న ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో విండీస్‌- భారత జట్లు మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టుల్లో తలపడనుంది.