బాల్ టాంపరింగ్: చండీమల్‌పై వేటు

బాల్ టాంపరింగ్: చండీమల్‌పై వేటు

శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వేటు వేసింది. వెస్ట్ ఇండీస్ తో జరిగిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు ఐసీసీ విచారణలో స్పష్టం అయింది. దీంతో ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. నిషేధంతో పాటు మ్యాచ్‌ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. ఈ నిషేధంతో వెస్ట్ ఇండీస్ తో జరిగే మూడో టెస్టులో చండీమల్‌ ఆడటం లేదు.

కెప్టెన్‌ చండిమల్‌ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అతిక్రమించి.. రెండో టెస్టు(రెండో రోజు ఆట) చివరి సెషన్‌లో తన ఎడమ జేబులోంచి స్వీట్‌ ముక్కల్ని తీసి బంతిపై అదిమిపెట్టి రాసినట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్‌పై బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అయితే తాను బాల్  ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమల్ తర్వాత నిజాన్ని ఒప్పుకున్నాడు. బాల్‌ను షైన్ చేసేందుకు స్వీట్ లాంటి పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో వెల్లడించాడు. వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.

Photo: FileShot