అర్ధరాత్రి హైడ్రామా..! చంద్రబాబు అరెస్ట్..

అర్ధరాత్రి హైడ్రామా..! చంద్రబాబు అరెస్ట్..

అర్ధరాత్రి సమయంలో అమరావతి ప్రాంతంలో హైడ్రామా నడిచింది... ఓవైపు బిల్లుకు శాసనసభ ఆమోద ముద్ర వేయగా... రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని దారి  మళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లారు. మళ్లీ మందడం, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. ఈ  క్రమంలో మంగళగిరిలో చంద్రబాబును తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఆపారు. రహదారిపై భైఠాయించి ఆందోళన చేశారు. డొంకరోడ్డులో వాహనాన్ని  తిప్పడంపై తీవ్ర ఆగ్రహం చేశారు టీడీపీ నేతలు. 

ఇక, అంతకు మందు అసెంబ్లీ బయట చంద్రబాబు మెట్లపైనే కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఓ చీకటి రోజు అన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపేయాలనే ఘోరమైన తప్పిదానికి శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. మరోవైపు... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పగలంతా వివిధ ప్రాంతాలకు తిప్పారు. గల్లాను గుంటూరు జిల్లా కొల్లిపరకు తీసుకెళ్లారు  పోలీసులు. అనంతరం ఆయనను వదిలేశారు.