మీరేమీ డిక్టేటర్ లు కాదు !

 మీరేమీ డిక్టేటర్ లు కాదు !

ఇసుక అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్షకు దిగారు. ఈ దీక్ష 12 గంటలపాటు సాగనుంది. చంద్రబాబు ఆందోళనకు  మద్దతు తెలియజేసిన జనసేన.. .తమ పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులను పంపింది. వారిలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ ఉన్నారు. ఇసుక కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల చిత్రపటాల దగ్గర నివాళులు అర్పించారు చంద్రబాబు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత. ఇసుక అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. అధికార పార్టీ నాయకులు అదే పనిగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.  మేము మీకంటే ఎక్కువ తిట్టగలమని అన్నారాయన.

లాంగ్‌ మార్చ్‌ నిర్వహించిన పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారని..అలాంటి విమర్శలు మీపైనా...మీ కుటుంబంపైనా చేస్తే తట్టుగోలరా అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీకి ఒక అవకాశం ఇచ్చిన పేద ప్రజలకు మరణశాసనం కావాలా అని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఏది మంచిదో ఒక్కరోజు కూడా ఆలోచించడం లేదని విమర్శించారాయన.  రాష్ట్రంలోని డబ్బంతా సీఎం దగ్గరే ఉండాలా అని ప్రశ్నించారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ.. రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు చంద్రబాబు. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. సరైన కసరత్తు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

ఇసుక సమస్య పరిష్కారానికి ఉచిత ఇసుక పాలసీ తప్ప వేరే మార్గమే లేదన్నారు చంద్రబాబు. అధికారం ఉందని రెచ్చిపోతే.. ప్రజలు తిరుగుబాటు చేస్తారని.. పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు చంద్రబాబు. వైసీపీ నాయకులేమీ డిక్టేటర్లు కారన్నారు టీడీపీ అధినేత. ప్రశ్నిస్తే.. భయపెట్టి.. టెర్రరిస్టుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీ వాళ్లు దొంగ ఇసుక లారీలను పట్టుకుంటే.. ఎదురు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలీసులకు ఫ్రీ హ్యాండిస్తే ఇసుక మాఫీయాను నిర్మూలిస్తారని చెప్పారాయన. ఇసుక కొరత వల్ల చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలకు బదులు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు. 40 నుంచి 50 మంది చనిపోతే కేవలం ఐదుగురికే పరిహారం ఇచ్చి ఆపేశారని విమర్శించారాయన. తాను పదకొండు మంది ముఖ్యమంత్రులను చూశానని,  ఇలాంటి సీఎంను చూడలేదని జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రభుత్వానికి శక్తి ఉంటే.. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా బోర్డర్లు సీజ్‌ చేయాలని  డిమాండ్ చేశారాయన.