మోడీ సూచనల మేరకే ఈసీ పనిచేస్తోంది

 మోడీ సూచనల మేరకే ఈసీ పనిచేస్తోంది

అధికారంలోకి వచ్చాక మీడియా సమావేశం నిర్వహించని ఏకైక ప్రధాని మోడీ అని ఏపీ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలే ఉండవని ఆరోపించారు. సోమవారం కర్ణాటకలోని మాండ్యలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిందని.. మహిళా భద్రత అంశంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి సంస్థలను మోడీ ధ్వంసం చేశారని మండిపడ్డారు. దేశ రక్షణ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజీపడిందన్న చంద్రబాబు.. మోడీ సూచనల మేరకు ఈసీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ఓట్ల లెక్కింపులో 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా? అని ఓటర్లను ప్రశ్నించారు. మోడీ పాలనలో వ్యవసాయం బాగా దెబ్బతిందని, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. ఆయన మాటలకు, పనులకు పొంతన లేదన్నారు. రూ.2 వేల నోట్ల వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగిందని, అసలు ఆ నోటును ఎందుకు తెచ్చారో మోడీ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో సీఎం కుమారస్వామి సుపరిపాలన అందిస్తున్నారని  చంద్రబాబు కితాబిచ్చారు. ఆయన తనయుడుని ఉద్దేశిస్తూ.. మీ అందరి ‘జాగ్వార్‌’ నిఖిల్‌ కోసం ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు.