ద్వివేది తన ఓటు వేసుకోలేక పోయారు

ద్వివేది తన ఓటు వేసుకోలేక పోయారు

రాష్ట్ర సీఈవో ద్వివేది తన ఓటు వేసుకోలేక వెనక్కి వచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇంత అసమర్థ నిర్వహణ ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించి.. అనవసర బదిలీలు చేసి రాజకీయాలు చేయడంలో ఈసీ ముందుందని ఎద్దేవా చేశారు. పోలింగ్‌ రోజు ఉదయం 9 గంటల సమయానికి 30 శాతానికిపైగా ఈవీఎంలు పనిచేయలేదని, అసలు ఈ దేశంలో ఎన్నికల సంఘం ఉందా అని మండిపడ్డారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

కనీస ఏర్పాట్లు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించడం మాత్రం ఎన్నికల కమిషన్‌కు చేతకాలేదు. ఎన్నికల రోజు మధ్యాహ్నానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. తాను వీడియో విడుదల చేసిన తర్వాత ఓటర్లు అనూహ్యంగా స్పందించారు. భారీ స్థాయిలో ఓటర్లు క్యూ లైన్లలో నిలబడ్డారు. అలాంటి వారిని కూడా ఈసీ తీవ్ర అవస్థలపాలు చేసింది. ఇంత అస్థవ్యస్థ పాలనకు ఎవరు బాధ్యులు. ఏపీలో ఓటు హక్కు ఉన్నవాళ్లు కూడా తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇంత మంది రావడం ముందెన్నడూ చూడలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. 

అడుగుడునా సమస్యలు సృష్టించి గందరగోళం చేయాలని ఈసీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఈవీఎంలు 20 ఏళ్లుగా ఉన్నాయని.. పూర్తిస్థాయిలో 2009, 2014లో వాడారని మండిపడ్డారు. లోటుపాట్ల మీద ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నామని తెలిపారు. సందేహాలకు సమాధానాలు చెప్పాలే కానీ ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనంటూ మళ్లీ కోర్టుకు వెళ్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.