'ఇదే కేసీఆర్ నిజ స్వరూపం.. ఆయనే బైట పెట్టుకున్నారు!'

'ఇదే కేసీఆర్ నిజ స్వరూపం.. ఆయనే బైట పెట్టుకున్నారు!'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిజస్వరూపాన్ని ఆయనే బైట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌తో కుమ్మక్కు రాజకీయాలను, లాలూచిని కేసీఆరే వెల్లడించారన్నారు. కేసీఆర్ అనే పాము బయట కొచ్చిందని వ్యాఖ్యానించిన ఆయన.. తన మనసులో టీడీపీపై అక్కసంతా కేసీఆర్ బయటపెట్టారని మండిపడ్డారు. జగన్ పట్ల తనకున్న మోజును కేసీఆర్ వెల్లడించారని.. మూడు పార్టీలు (వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌) లాలూచి రాజకీయాలపై తొలినుంచి చెప్పాం.. దీనికి కేసీఆర్, రాంమాధవ్‌, జగన్‌ వ్యాఖ్యలే రుజువు అన్నారు చంద్రబాబు. 

ఆంధ్ర బాగుండాలని ఉంటే కేసీఆర్ అఫిడవిట్లు వేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. కృష్ణా నదిపై 9 ప్రాజెక్టులు, గోదావరి నదిపై 4 ప్రాజెక్టులు అడ్డుకుంటారా..? అని నిలదీశారు. పోలవరంపై డీమ్డ్ టు అప్రూవల్ అని చట్టంలో ఉంది.. మరి, పోలవరంపై కేసీఆర్ ఎందుకు అన్ని కేసులు వేశారు..? ముచ్చుమర్రికి ఎందుకు వ్యతిరేకం అంటే కేసీఆర్ జవాబివ్వడు!, పోతిరెడ్డిపాడుకు ఎందుకు వ్యతిరేకం అంటే నోరు తెరవడు! అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకుంటావు, జగన్ గెలవాలంటావు..! ఇవే టీఆర్ఎస్, వైసీపీ లాలూచికి రుజువు అన్నారు చంద్రబాబు. ఇన్నాళ్లూ చాటుగా జగన్ కు డబ్బులు కేసీఆర్ పంపించారని ఆరోపించిన ఏపీ సీఎం... ఇప్పుడు బాహాటంగానే జగన్‌కు కేసీఆర్ మద్దతు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్‌ను ఓడిస్తేనే కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పినట్టు అవుతుందని పిలుపునిచ్చారు చంద్రబాబు.