రాజధాని అంటే వైసీపీకి ఎగతాళి..!

రాజధాని అంటే వైసీపీకి ఎగతాళి..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగతాళి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని ప్రాంతంపై వైసీపీ నేతలకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి రాజధాని అమరావతి ప్రతీకగా పేర్కొన్న చంద్రబాబు.. వైసీపీ నేతలు ఆదినుంచీ అమరావతిని వ్యతిరేకిస్తున్నారని.. అందుకు ఆ పార్టీ నేతలు సర్వశక్తులూ ఒడ్డారని ఆరోపించారు. కనీసం, రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచినా వైసీపీ నేతలను రాలేదని దుయ్యబట్టిన చంద్రబాబు.. పెట్టుబడులు కూడా అడ్డుకున్నారని.. పంట పొలాలు తగలబెట్టారంటూ తమపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కొంతమందితో హైకోర్టులో పిటిషన్‌ వేయించారని విమర్శించిన చంద్రబాబు.. అప్పుడు కష్టపడినందునే ఇప్పుడు భవనాలు తయారయ్యాయని గుర్తుచేశారు. ఇక, రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం రాకుండా అడ్డుపడ్డది వైసీపీ నేతలేనని ఆరోపించారు చంద్రబాబు. వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాసింది వైసీపీ నేతలేనన్న టీడీపీ అధినేత.. జరగని అవినీతిని ప్రస్తావించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 90 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని.. భూముల ధరలు పెరిగి వారి ఆస్తులు పెరిగాయని వెల్లడించారు చంద్రబాబు.