రేపు కాకపోతే ఎల్లుండి.. మళ్లీ రానివ్వకపోతే ఆ తర్వాత రోజు...

రేపు కాకపోతే ఎల్లుండి.. మళ్లీ రానివ్వకపోతే ఆ తర్వాత రోజు...

విశాఖ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర చంద్రబాబును వైసీపీ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. కొన్ని గంటల పాటు హైడ్రామా తర్వాత చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌కి తరలించారు.. అయితే, వీఐపీ లాంజ్‌లో విశాఖ డీసీపీ ఉదయ్‌భాస్కర్‌.. చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. తిరిగి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు..  దీనిపై ఫైర్ అయిన చంద్రబాబు.. రేపు రానివ్వకపోతే ఎల్లుండి వస్తా.. ఎల్లుండి రానివ్వకపోతే ఆ తర్వాత రోజు వస్తా అంటూ వ్యాఖ్యానించారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.. అనంతరం చంద్రబాబును మొత్తానికి హైదరాబాద్‌ విమానం ఎక్కించారు పోలీసులు. 

టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర ప్రజాయాత్రకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండ్రోజులపాటు ఆయన విశాఖ, విజయనగరం జిల్లాల్లో యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు చేరుకున్నారు. అప్పటికే వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. చంద్రబాబు విమానం దిగి కారెక్కగానే వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అంగుళం కూడా కదలనీయకుండా వైసీపీ శ్రేణులు బైఠాయించాయి.. దీంతో చంద్రబాబు కారులోనే ఉండిపోయారు. గంటలు గడుస్తున్నా కూడా వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి కదల్లేదు.. టీడీపీ శ్రేణులు కూడా పోటాపోటీగా బైఠాయించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలను అదుపు చేయలేక పోలీసులు సతమతమయ్యారు. ఉత్తరాంధ్ర జేఏసీ కార్యకర్త ఒకరు చంద్రబాబు కారెక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.. మధ్యాహ్నం 2 గంటలు దాటినా కూడా చంద్రబాబు ముందడుగు వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును అంబులెన్స్ లోకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే కారు దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. చంద్రబాబును కూడా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అనుమతి ఉన్న పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాల్చి చంపినా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

ఓవైపు వైసీపీ శ్రేణులు, పోటీగా టీడీపీ నేతలు.. విమానాశ్రయ ప్రాంగణం మొత్తం మోహరించారు. ఈ నేపథ్యంలో టూర్‌ సాగడం అసాధ్యమని గ్రహించిన పోలీసులు.. చంద్రబాబును వెనక్కు వెళ్లాల్సిందిగా కోరారు. అయితే చంద్రబాబు ససేమిరా అనడంతో 151 నోటీసు ఇచ్చి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నాలుగున్నర గంటల సమయంలో విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు.. పర్యటనను వాయిదా వేసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ లాంజ్‌లోనే పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు.. యాత్రకు పర్మిషన్ ఉన్నా కూడా పోలీసులు రక్షణ కల్పించకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. యాత్ర ఎలాగైనా జరిపి తీరుతామని స్పష్టం చేశారు..