50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి

50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి

50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఓటర్‌ స్లిప్‌లు, వీవీప్యాట్‌ స్లిప్పులు ట్యాలీ కావాలన్నారు. వీవీ ప్యాట్‌లు లెక్కించడానికి 6 రోజులు పడుతుందని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చిందని చంద్రబాబు విమర్శించారు. సుప్రీంకోర్టులో మళ్లీ రివ్యూ పిటిషన్‌ వేస్తామని ఆయన స్పష్టం చేశారు. 2009 నుంచి ఈవీఎంలపై పోరాటం చేస్తున్నామని.. తప్పులను ఎత్తిచూపే వాళ్లపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేశామని, సీఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. విజయవాడలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఈవీఎంలలో లోటు పాట్లు ఉన్నాయంటూ పోరాటం చేస్తున్న.. హరిప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టారు. ఈవీఎంలలో లోపాలపై పోరాటం ఇప్పటిది కాదు.. కొన్నేళ్లుగా సాగుతోంది. సుబ్రమణ్యస్వామిలాంటి వారు కూడా గతంలో కేసులు వేశారు. తప్పులను ఎత్తిచూపితే ఎందుకు రాజకీయం చేస్తున్నారు. తిరిగి తమపై ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ఎప్పుడైనా అర్థరాత్రి వరకు జరగడం చూశారా?. ఓటు వేసేందుకు చెన్నై, బెంగళూరు, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారని, రాష్ట్రం పట్ల బాధ్యతతో వచ్చిన వారిని గంటల తరబడి నిలబెడతారా?. ఇంత అవకతవకల పోలింగ్‌ ఎప్పుడూ చూడలేదు' అని చంద్రబాబు అన్నారు.