తమిళనాడుతో పోలిస్తే గుజరాత్ సాధించింది ఎంత?

తమిళనాడుతో పోలిస్తే గుజరాత్ సాధించింది ఎంత?

తమిళనాడులాంటి రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌ సాధించింది ఎంత? అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మోడీ వైఫల్యాలను రఘురాంరాజన్‌ వంటి వాళ్లు... అర్థమయ్యేలా చెప్పి... పరిష్కారం చూపారని, అందుకే అలాంటి వారంటే మోడీకి గిట్టదని చంద్రబాబు అన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు భవిష్యత్‌లో కలిసి పనిచేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం చెన్నైలో చంద్రబాబు డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. అనంతరం డీఎంకే ముఖ్యనేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసింది శూన్యమని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమే అధికారంలోకి వస్తుందని, స్టాలిన్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు. డీఎంకేకు ఓటేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు తమిళనాడులోని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి వారసుడు స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక. అన్నాడీఎంకేకు ఓటేస్తే మోడీకి వేసినట్టే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. జల్లికట్టును నిషేధించి మోడీ తమిళ సంస్కృతిని అవమానపరిచారు. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశముంది. కొన్ని ఈవీఎంల పనితీరు సరిగా లేదని సీఈసీ చెబుతోంది, అలాంటప్పుడు వాటిని ఎలా వినియోగిస్తారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణితో ఈసీ వ్యవహరిస్తొంది. అభివృద్ధి చెందిన దేశాలు వద్దనుకున్న ఈవీఎంలు మనకు ఎందుకు. ఈసీకి ఎన్నికలు నిర్వహించడం మీద కన్నా.. రాజకీయాలు చేయడం.. నేతలు చెప్పినట్టు తలాడించడంపైన శ్రద్ధ ఎక్కువ. ఈవీఎంల విషయంలో.. దశాబ్దాలుగా ఏం చెబుతున్నానో ఇప్పుడూ అదే మాట్లాడుతున్నాను. ఈవీఎంలపై తన పోరాటం ఈనాటిది కాదు, ఈసీని కూడా మోడీ పూర్తిగా భ్రష్టుపట్టించారు అని చంద్రబాబు స్పష్టం చేశారు.