అన్నదాత సుఖీభవ 2వ కిస్తీ ఇవ్వాల్సిందే..!

అన్నదాత సుఖీభవ 2వ కిస్తీ ఇవ్వాల్సిందే..!

అన్నదాత సుఖీభవకు సంబంధించి 2వ కిస్తీ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ... దీనిపై ఇవాళ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశంపార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశంలో చర్చ జరిగింది. రైతు రుణమాఫీపై, అన్నదాత సుఖీభవపై ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సమాలోచనలు చేశారు. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన నెలకొని ఉందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు నేతలు. టీడీపీ ప్రభుత్వం గతంలో అందజేసిన 4వ, 5వ విడత కిస్తీలకు సంబంధించిన రైతు రుణమాఫీ అర్హత పత్రాలను ప్రస్తుత ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై రైతులు కలవరపడుతున్నారని చంద్రబాబుకు వివరించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ రైతు రుణమాఫీ అన్నది ఆన్ గోయింగ్ ప్రాసెస్.. దానిని పార్టీ హామీ కింద జమకట్టి రైతులకు అన్యాయం చేయడం తగదని వ్యాఖ్యానించారు. వడ్డీతో సహా రైతులకు ఇవ్వాల్సిన 4వ, 5వ విడత మొత్తాలను వెంటనే చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి 2వ కిస్తీ రూ.4,500కోట్లు కూడా రైతులకు అందజేస్తే ఈ ఖరీఫ్ లో పెట్టుబడులకు ఇబ్బందులు ఉండేవి కావని అభిప్రాయపడ్డ ఆయన... రైతు భరోసా ఎటూ అక్టోబర్ 15నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించినందువల్ల ఈ ఖరీప్ కు ఉపయోగపడేలా అన్నదాత సుఖీభవ 2వ కిస్తీని కూడా రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై శాసనసభ, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.