ఈవీఎంలపై తాము పదేళ్లుగా పోరాడుతున్నాం

ఈవీఎంలపై తాము పదేళ్లుగా పోరాడుతున్నాం

ఈవీఎంలపై తాము పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం దేశంలోని 21 విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాను కలిశారు. అనంతరం బయటికి వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడారు. 5 వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాక ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారని ఈసీఐని చంద్రబాబు ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపు సమంలో ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించాలన్నారు. అభ్యర్థులు కోరినచోట మళ్లీ లెక్కించాలని కోరారు. పారదర్శకత ఉంటే వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచితే ప్రజలంతా చూసుకుంటారని చెప్పారు. 

'ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలి. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం కష్టమైన పని కాదు. తాము పోరాటం చేసేది తమ కోసమో, పార్టీ కోసమో కాదు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కల్గించేందుకే పోరాడుతున్నాం. ఓట్ల లెక్కింపు ఆలస్యమైనా ఇబ్బంది లేదు. తమ డిమాండ్లన్నీ సహేతుకంగా లేవంటూ బీజేపీ ఆరోపిస్తోందని.. ఆ పార్టీ నేతలు ఈవీఎంలను మానిప్యులేట్‌ చేయాలనుకుంటున్నారా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.