చంద్రబాబు ఆ విమానంతో ఎందుకు రిస్క్ చేస్తున్నారు?

చంద్రబాబు ఆ విమానంతో ఎందుకు రిస్క్ చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ముంబై నుంచి విజయవాడకు తిరిగి వచ్చారు. ఆయన తనకు చిరపరిచితమైన విమానంలో ప్రయాణించారు. సీఎం, ఆయన బృందం ఎన్నాళ్లుగానో ఉపయోగిస్తున్న ఎంబ్రేర్ వీటీ సీకేపీ విమానం మరోసారి ముంబై పర్యటనకు వెళ్లింది. చంద్రబాబు ఎప్పుడూ ఈ విమానాన్ని ఎందుకు వినియోగిస్తారంటే దీనికయ్యే ఖర్చు దాదాపుగా ఉచితం. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే ఈ విమానంలో ప్రయాణం ఎంతో ప్రమాదకరం. మరి ఏపీ సీఎం ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారు?

ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణించే విమానం ఒక ప్రైవేట్ జెట్. దీనికి నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ లేదు. వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన లైసెన్స్ అయినా లేదు. అంటే ఒక వీఐపీ ప్రయాణించే విమానానికి ఉండాల్సిన ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవు. కృష్ణపట్నం పవర్ ప్లాంట్ నిర్వహించే ప్రముఖ సంస్థ నవయుగ కంపెనీ ఈ విమానం యజమాని. దీనిని కేవలం యజమానులు, వారి అతిథుల రాకపోకలకు మాత్రమే ఉపయోగిస్తారు. అలాంటి విమానాన్ని దేశంలోనే అతికొద్ది మందికి ఉన్న జడ్ ప్లస్ స్థాయి భద్రత కలిగిన ఏపీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడుతున్నారు. 

సెప్టెంబర్ 2009లో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత వీఐపీలు ప్రయాణించే విమానాల భద్రతపై అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. అయినప్పటికీ మూడేళ్లుగా చంద్రబాబు భద్రతకు భరోసా లేని ఇదే విమానాన్ని వాడుతున్నారు. దాదాపుగా 200 సార్లు ఈ ప్రైవేట్ విమానంలో ప్రయాణించారు. ముఖ్యమంత్రి కార్యాలయం లెక్కల ప్రకారం 50 మార్లు చంద్రబాబు ఈ విమానంలో ప్రయాణం చేశారు. 

నిర్ణీత భద్రతా ప్రమాణాలు లేని ఈ విమానాన్ని బాబు ఎందుకు ఎంచుకున్నారంటే ఇందులో ప్రయాణం దాదాపుగా ఉచితం. దీనికి ఇంధన ఛార్జీలు, ఎయిర్ పోర్ట్ రుసుము కడితే చాలు. ఒక వాణిజ్య విమానాన్ని వాడితే అయ్యే ఖర్చులో అతితక్కువ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంకెల్లో చెప్పుకుంటే కేవలం రూ.20 లక్షలు ఖర్చు వస్తుంది. రాష్ట్రంలో సీఎం ప్రయాణించగల అన్ని హంగులు ఉండే విమానాలు పెద్దగా లేకపోవడంతో రిస్క్ అయినా అత్యవసరంగా అందుబాటులో ఈ విమానాన్ని ఉపయోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ఏడాదిగా ఈ విమానం మరమ్మత్తుల్లో ఉండటంతో దీనిని వాడటం మానేశారు. కానీ బాబు ముంబై పర్యటన కోసం దీనినే ఎంపిక చేసుకోవడం మరో కొసమెరుపు