హోదా  విషయంలో నేను రాజీపడలేదు

హోదా  విషయంలో నేను రాజీపడలేదు

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడలేదని మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. హోదా సాధించేందుకు ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని గుర్తుచేశారు. చివరిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగానే ప్రత్యేక హోదా అమలుకాలేదన్న సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కేబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ కు పంపించారు కనుక మీరు ప్లానింగ్ కమిషన్ కు వెళితే మొత్తం పని అయిపోతుందనంటూ కొత్త థియరీ తీసుకువచ్చారని ఆరోపించారు.

'మీరు బురదచల్లాలంటే ఏ బురదైనా చల్లోచ్చు. నేను దాని గురించి బాధ పడడంలేదు. ప్రత్యేక హోదా కోసం నా మీద బురద చల్లితే సాధించలేరు. పోలవరం కోసం ఆర్డినెన్స్ పాస్ చేసి ఏడు మండలాలను తీసుకువచ్చాం. మీరు ప్రత్యేక హోదా సాధిస్తారని మీకు ఓట్లేశారు. సాధించండి.. నేను కాదనట్లేదే. మీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు. టీడీపీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్దితో ప్రయత్నించాం. కేంద్రంలో మిత్ర పక్షంగా ఉంటూ ప్రత్యేక హోదా కోసం విభేదించాం. ఢిల్లీకి వెళ్లి శాలువాలు కప్పి మెమెంటోలు ఇచ్చారని అంటున్నారు. మరి మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.. అదే శాలువాలు కప్పి మెమెంటోలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా మీరు సాధిస్తామని అంటున్నారు దానికి మేము చిత్త శుద్దితో సహకరిస్తాం' అని చంద్రబాబు అన్నారు.