ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి

ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి

ఎన్నికల ప్రక్రియపై అందరికీ అవగాహన రావాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని తెలిపారు. వీపీ ప్యాట్లు 50 శాతం లెక్కించాలంటే ఈసీకున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని కోర్టుకు ఈసీ తప్పుడు అఫిడవిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. మా పోరాట ఫలితంగానే వీవీ ప్యాట్లు పెట్టారని అన్నారు. ఎన్నికల కమిషనర్‌కి టెక్నాలజీపై ఉన్న అవగాహన ఎంత? అని, ఏ ప్రాతిపదికన ఆయన వాదిస్తున్నారని ప్రశ్నించారు. ఏ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో.. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్స్‌ ఏంటో తన కంటే బాగా వీళ్లకి తెలుసా? అని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎవరికీ అర్థంకాని రోజుల్లోనే.. ఈ-సేవ లాంటివి ప్రవేశపెట్టిన నాయకుడిని తానని, వాస్తవాలు తెలుసుకోకుండా ఈసీ బుకాయించడం సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారదర్శకంగా వ్యవహరించడానికి ఈసీకున్న అభ్యంతరమేంటీ..? గెలుపు విషయంలో నేను భయపడడం ఏమిటీ..? దూర ప్రాంతాల నుంచి టీడీపీకి ఓటేయడానికి వస్తే గెలుపు విషయంలో నాకు అనుమానాలు ఉంటాయా..? ఈవీఎంల వ్యవహరం సెట్ అయిందని అనుకోగానే హింసాత్మక సంఘటనలు జరిగాయి. సంయమనంతో ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించా. చాలా దేశాలు ఈవీఎంలు వద్దని బ్యాలెట్ పద్దతికే మొగ్గు చూపాయి.

తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశారు. ఎంత పోరాడినా లాభం లేదని.. సారీ చెప్పి ఊరుకున్నారు. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు తీసేశారు. ఏపీలోనూ ఫామ్‌-7 వాడి ఓట్లు తీసేయాలని కుట్రలు చేశారు. మేం జాగ్రత్త పడ్డాం కాబట్టి సరిపోయింది.. లేకుంటే ఇక్కడా అదే జరిగేది. 7 లక్షల 50 వేల ఓట్లు తీసేసేందుకు ఫామ్‌-7 ఇచ్చారు.. ఈ విషయం స్వయంగా సీఈవో ద్వివేది ఒప్పుకున్నారు. మేం ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇప్పటికీ ఇవ్వలేదు. ఈసీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అనేందుకు.. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి. వీవీప్యాట్‌లో స్లిప్‌లు 3 సెకన్లు కూడా కనిపించడం లేదని చంద్రబాబు ఆరోపించారు.