బీజేపీ, మోడీ దేశభక్తి ఎలాంటిదో రుజువైంది

బీజేపీ, మోడీ దేశభక్తి ఎలాంటిదో రుజువైంది

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తులను బీజేపీ అభ్యర్థులు గొప్ప దేశభక్తులుగా ప్రశంసించడం ఆందోళనకు గురి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీంతో బీజేపీ అభ్యర్థులదే కాకుండా అలాంటి వారికి మద్దతిస్తున్న నరేంద్ర మోడీ దేశభక్తి ఎలాంటిదో తేటతెల్లం అవుతోందని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో అమరుడైన మహారాష్ట్ర పోలీస్ అధికారి హేమంత్ కర్కరేను నిందించారని, ఇప్పుడు ప్రపంచ శాంతికి దిక్సూచిగా, అహింసకు ప్రతిరూపంగా నిలిచిన జాతిపిత మహాత్మా గాంధీని అవమానిస్తున్నారని బాబు విమర్శించారు. ఈ గుజరాత్ మోడల్ నే బీజేపీ దేశమంతటా వ్యాపింప చేయాలనుకుంటోందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇవాళ మహాత్ముడిని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నుంచే కాకుండా ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో వెనక్కి తగ్గిన బీజేపీ ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. అలాగే సాధ్వీ వెంటనే తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని సూచించింది. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ కూడా తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు.