టీడీపీ గెలుపు 1000 శాతం తథ్యం

టీడీపీ గెలుపు 1000 శాతం తథ్యం

టీడీపీ గెలుపు 1000 శాతం తథ్యమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 110-140 సీట్లు టీడీపీ సాధిస్తుందనేది సర్వత్రా అభిప్రాయమని అన్నారు. ఏపీలో ప్రతి సర్వే గెలిచేది టీడీపీ పార్టీయే అన్ని తెలిపారు. సోమవారం పార్టీ నేతలతో అమరావతిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికేనని చంద్రబాబు స్పష్టంచేశారు. టీడీపీ శ్రేణులన్నీ సంఘటితంగా పనిచేశాయని, అందుకే ఈ ఎన్నికలో తమ గెలుపు ఏకపక్షం అయ్యిందని సీఎం అభిప్రాయపడ్డారు. టీడీపీ గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, అయినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. 

తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారని తెలిపారు. సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామన్నారు. ఐపీ అడ్రస్‌లు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్‌ రిపేర్ వస్తే.. కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టామని చంద్రబాబు తెలిపారు. వెంటనే శాంతి భద్రత సమస్యలు సృష్టించే కుట్రలు చేశారని ఆరోపించారు. 

వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని, ఎన్నికల సంఘంపై 15 ఏళ్లుగా టీడీపీ పోరాడుతోందని చంద్రబాబు అన్నారు. ఈవీఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరాయని, ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్క క్షమాపణతో సరిపెడతారా? అని సీఎం ప్రశ్నించారు. 50 శాతం వీవీ ప్యాట్ రశీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరమని చంద్రబాబు నిలదీశారు.