కాలేజీ రోజుల నుంచి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదా..?

కాలేజీ రోజుల నుంచి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదా..?

కాలేజీ రోజుల నుంచి వారి మధ్య ఆధిపత్య పోరు ఉంది. నలభై ఏళ్లు అయినా వారి మధ్య ఇంకా అదే వైరం కొనసాగుతోంది. ఒకరు సీఎంగా పనిచేసి ప్రస్తుతం మాజీ అయితే.. ఇంకొకరు సీనియర్‌ నేతగా.. మంత్రిగా ఆ జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అని మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? 

నేతల మధ్య రాజకీయ వైరం బుసలు కొడుతోందా?

మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందినవారే. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో చదువుకొనే రోజుల నుంచి వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంటుంటారు. చదువు పూర్తయిన తర్వాత కూడా రాజకీయంగా ఇద్దరూ చెరోదారి ఎంచుకున్నారు. మొన్నటి  అసెంబ్లీ ఎన్నికల్లో  జిల్లాలోని 14 స్థానాలకు గాను కుప్పం మినహా అన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. పెద్దిరెడ్డి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి పాత వైరం మళ్లీ బుసలు కొడుతోందట. 

కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి, పుంగనూరుపై చంద్రబాబు ఫోకస్‌!

మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తుంటే.. పుంగనూరు పెద్దిరెడ్డి అడ్డాగా ఉంది. గతంలో పీలేరు నుంచి కూడా పోటీ చేశారు పెద్దిరెడ్డి. ప్రస్తుతం ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు తలదూర్చడంతో నేతల మధ్య పోరు తీవ్రరూపం దాల్చినట్లు చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా దెబ్బతీయాని పెద్దిరెడ్డి.. పుంగనూరులో జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని టీడీపీ అధినేత లక్ష్యంగా పెట్టుకున్నారట. అందుకే ఈ రెండు నియోజకవర్గాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. 

కుప్పంలో జోరుగా వైసీపీ ఆకర్ష్‌!

తొలిసారి కుప్పం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో చంద్రబాబు వెనకబడటంతో టీడీపీ, వైసీపీ మధ్య లోకల్‌ హీట్‌ నెలకొంది. ఇదే టైమ్‌లో పుంగనూరులో అక్రమాలు జరుగుతున్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో  పెద్దిరెడ్డి బెదిరించి ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం ఈ వార్‌ డైరెక్ట్‌ ఫైట్‌గా మారిందట. కుప్పంపై ఫోకస్‌ పెంచిన మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు అక్కడి వ్యవహారాలను అప్పగించారట. దీంతో గడిచిన రెండు నెలలుగా కుప్పంలో టీడీపీ నుంచి వైసీపీలోకి రాజకీయ వలసలు బాగా పెరిగాయి. అధికారపార్టీ నేతలు దీనినో ఉద్యమంలా చేస్తున్నారు. అయితే బెదిరించి, భయపెట్టి, తాయిలాలు ఆశచూపించి టీడీపీ వాళ్లను లాక్కొంటున్నారని చంద్రబాబు మండిపడుతున్నారు. దీనికంతటికీ మంత్రి పెద్దిరెడ్డే కారణమని భావించి.. పుంగనూరుపై దృష్టపెట్టారట టీడీపీ అధినేత. 

మంత్రి పెద్దిరెడ్డి అండతోనే దౌర్జన్యాలంటూ చంద్రబాబు ఆరోపణ!

పుంగనూరులో ఇసుక దందాలు నడుస్తున్నాయని.. రౌడీ రాజ్యం కొనసాగుతోందని మంత్రి పెద్దిరెడ్డిపై మాటల దాడి మొదలుపెట్టారు చంద్రబాబు. ఓ న్యాయమూర్తిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించడంతో... దానిపై మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే ఓం ప్రతాప్‌  అనే యువకుడి మరణం వెనక నిజానిజాలు వెలికి తీయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. విచారణ కోరుతూ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత. మంత్రి పెద్దిరెడ్డి అండతోనే ఇలాంటివి జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. 

ఈ విధంగా చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డిలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీంతో కుప్పం, పుంగనూరుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని టెన్షన్‌ నెలకొందట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.