వారణాసిలోనూ చంద్రబాబు ప్రచారం..!

వారణాసిలోనూ చంద్రబాబు ప్రచారం..!

ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసిన వారణాసి లోక్‌సభ స్థానంలోనూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న... మోడీ పోటీ చేసిన వారణాసికి కూడా చంద్రబాబు ప్రచారానికి వెళ్తారు.. మోడీ ద్రోహాన్ని త్వరలోనే వారణాసి వేదికగా చంద్రబాబు ఎండగడతారని వెల్లడించారు. ఇక సీఈసీ సులీల్ అరోరా వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఒక్క రక్త పరీక్షతో రోగి గురించి వైద్యులు ఓ నిర్ధారణకు ఖచ్చితంగా రాలేరని వ్యాఖ్యానించారు. 

మే 23న తెలుగుదేశం ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయన్నారు బుద్దా వెంకన్న... మే 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారంటూ సెటైర్లు వేసిన ఆయన.. అలాగే ఈవీఎంలపై అన్ని కోణాల్లోనూ అనుమానాలు నివృత్తి కావాల్సిందేనన్నారు. నిన్న ఆత్మకూరులో దొరికిన వీవీ ప్యాట్‌ స్లిప్పులపై ఈసీ సమాధానం ఏమిటి..? అని ప్రశ్నించారు. అనేక క్రిమినల్ కేసులు ఉన్న వారి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించింది. కానీ, ఒకే ఒక కేసు ఉన్న హరిప్రసాద్ ను ఈవీఎంలపై చర్చకు ఎందుకు ఒప్పుకోలేదు..? అని నిలదీశారు బుద్దా వెంకన్న. దేశ చరిత్రలో ఏ ఈసీ మీద రాని విమర్శలు ప్రస్తుత ఈసీ పై వస్తున్నాయని.. ఇందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీ నియమించిన ఈసీ కావడమే కారణం అన్నారు. ఈసీ మద్దతు తోనే వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించిన వెంకన్న.. అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీకే మోడీ నియమించిన గవర్నర్ కూడా అపాయింట్‌మెంట్ ఇస్తారు అంటూ ఎద్దేవా చేశారు.