హోదా కోసం ప్రాణాలు తీసుకోవద్దు..

హోదా కోసం ప్రాణాలు తీసుకోవద్దు..

బతికి ఉండి పోరాడి.. అనుకున్నది సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో చేపట్టిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడారు. హోదా పోరాటంలో కొందరు భావావేశానికి లోనై త్యాగాలు చేయాలనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లిలో సుధాకర్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన సుధాకర్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, టీడీపీ తరఫున మరో రూ.5 లక్షలు సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని బాబు చెప్పారు. హోదా కోసం ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపిన ఉమేశ్‌ రెడ్డిని సీఎం అభినందించారు.

హోదా సాధించి తీరుతాం..
కేంద్ర ప్రభుత్వ నమ్మక ద్రోహంపై తిరుపతిలో వెంకన్న సాక్షిగా తొలి ధర్మపోరాట పోరాటం నిర్వహించామని, ఇది నాలుగో సభని బాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని అన్నారు.  అడ్డం వస్తే ఎదురు తిరుగుతామని ప్రజలంతా నినదిస్తున్నారని బాబు చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపైనా రాజీలేని పోరాటం చేస్తున్నామన్నాని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పారు.

పార్లమెంట్‌ వేదికగా అబద్ధాలు..
'నాకు మెచ్యూరిటీ లేదని మోడీ చెబుతున్నారు. మెచ్యూరిటీ ఎవరికి లేదో మోడీ తేల్చుకోవాలి. వైసీపీ ఉచ్చులో పడింది నేను కాదు. అవినీతి కుడితిలో పడింది మోడీనే' అని బాబు అన్నారు. పార్లమెంట్ మోడీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మోడీ చెబుతున్నట్టు తనది యూటర్న్‌ కాదని.. మోడీదే యూ టర్న్‌ అని.. తనది రైట్‌ టర్న్‌ అని అన్నారు.  అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పిన మోడీ.. జగన్‌ ఆస్తులనెందుకు జప్తు చేయలేదని నిలదీశారు.  అవిశ్వాసం పెడితే పార్టీల మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ సభలకు అడ్డం పడే పరిస్థితికి వచ్చారని అన్నారు.