వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక

వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక

టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని, రాష్ట్రంలో సామాన్యులు స్వతంత్రంగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని మాజీ ముఖ్యంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ దాడులు, దౌర్జన్యాలను వెంటనే ఆపాలని.. ఇక వీటిని ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో హత్యకు గురైన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఇవాళ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా  బాబు మాట్లాడుతూ.. రాష్ట్రం రౌడీ రాజ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అంగన్వాడీ టీచర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని.. కాంట్రాక్టర్లు, కేబుల్ ఆపరేటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. 

నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని అభిప్రాయపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదన్న బాబు.. ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోందన్నారు. 'ఇది రౌడీ రాజ్యమా? ప్రజాస్వామ్యమా?, మేము రౌడీయిజం చేస్తే మీరెక్కడ ఉండేవారు?, మా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?' అని ప్రశ్నించారు చంద్రబాబు. కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానన్న చంద్రబాబు.. అవసరమైతే పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉంటానని చెప్పారు.