'ఈ పనులు కేసీఆర్‌తో జగన్‌ చేయించగలరా?'

'ఈ పనులు కేసీఆర్‌తో జగన్‌ చేయించగలరా?'

ఓటు అడిగే హక్కు సంపాదించుకున్నాకే  ఓటు అడుగుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని.. ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో మన సంపద వదిలి వచ్చి ఏపీలో కష్టపడుతున్నా ఓర్వలేకపోతున్నారని అన్నారు. పోలవరం కడుతుంటే తెలంగాణ పెద్దలు అడ్డుకుంటున్నారని.. దీనిపై రాష్ట్ర ప్రజలు పోరాడుతుంటే.. కేసీఆర్‌కు జగన్ ఊడిగం చేస్తారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు జగన్‌ బానిసలా మారారని బాబు విమర్శించారు. 

'వైసీపీ అభ్యర్థులను కేసీఆరే డిసైడ్‌ చేస్తున్నారు. చంద్రబాబు కావాలా..? కేసీఆర్ కావాలా..? ప్రజలు ఆలోచించాలి. నేను తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే ఏపీ పాలన కావాలా..? అని అడిగారు. ఏపీ ప్రజలకు తెలంగాణ దొరల పాలన అవసరమా..?' అని ప్రశ్నించారు బాబు.

'నాపై చేసే విమర్శల్లో ఎంత నిజం ఉందో ఆలోచించాలి. డేటా చోరీ ఎపిసోడ్‌లో కుట్రను ఎస్టాబ్లిష్ చేస్తే సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు డేటా చోరీ చేశారు.  గతంలో జేబు దొంగలు ఉండేవారు.. ఇంటి దొంగలుండే వారు.. కానీ ఇప్పుడు ఓటు దొంగలు వచ్చారు' అని ఆయన విమర్శించారు. 

జగన్ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ జేబులోకి వెళ్లినట్టేనన్న బాబు.. ఏపీ సీట్ల బలంతో ఏపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యవహరించడం ఖాయం అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని కేసీఆర్‌తో జగన్ కేంద్రానికి లేఖ రాయించాలని బాబు కోరారు. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ పనులన్నీ జగన్ కేసీఆర్‌తో చేయించగలరా..? అని ప్రశ్నించారు బాబు. ఈ విషయాలను ప్రజల్లో చర్చకు పెడతానని.. కష్టాల్లో ఉన్న ఏపీని చూసి నవ్వే వారికి.. వారికి సహకరించే వారికి గుణపాఠం చెప్పాలని కోరారు.