మోడీకి 3 రోజులే గడువు: బాబు

మోడీకి 3 రోజులే గడువు: బాబు

'మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గుణపాఠం చెబుతాం. ఇప్పటికైనా కేంద్రం తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం. ఏపీ ప్రజలంతా మీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మేం కన్నెర్న చేస్తే మీరు ఏమవుతారో గుర్తు పెట్టుకోండి' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఢిల్లీ వేదికగా కొద్దిసేపటి క్రితం ఆయన ధర్మ పోరాట దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఇప్పటికైనా మోడీ తప్పు తెలుసుకుని ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రత్యేక హోదీ ఇవ్వాలని.. ఇందుకు మూడు రోజులు గడువు ఇస్తున్నామని చెప్పారు. లేదంటే ఏపీలో బీజేపీని ప్రజలు శాశ్వతంగా కనుమరుగు చేస్తారని తెలిపారు.  ఏపీకి కేంద్రం అన్యాయం చేసినందుకే ధర్మపోరాట దీక్ష చేస్తున్నామన్నారు. 

ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్నామన్నారు. హోదా ఇస్తేనే ఏపీ కోలుకుంటుందని విభజన సమయంలో చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదీ కావాలని అప్పట్లో పార్లమెంట్‌లో అరుణ్‌ జైట్లీ డిమాండ్‌ చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ పెద్దలే ఆ మాట నిలబెట్టుకోలేదని బాబు అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని బాబు చెప్పారు. 

మోడీకి పాలించే అర్హత లేదన్న చంద్రబాబు.. తాము హక్కుల కోసం పోరాడుతున్నామని.. భిక్ష కోసం కాదని స్పష్టం చేశారు.  కేంద్రం నిధులు ఎక్కడెక్కడ ఖర్చుపెట్టామో లెక్కలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని.. మరి.. తాము కట్టిన పన్నులు ఎక్కడ ఖర్చు చేశారో మీరు చెబుతారా అని మోడీని బాబు ప్రశ్నించారు.  

రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని, రూ. 16 వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉందని చెప్పిన చంద్రబాబు.. కేంద్రం రూ.3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేర్చాల్సి వుందని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.