మోడీ సర్టిఫికెట్‌ నాకు అక్కర్లేదు..

మోడీ సర్టిఫికెట్‌ నాకు అక్కర్లేదు..

బీజేపీకి బుద్ధి చెప్పడానికి పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలులో ఇవాళ జరుగుతున్న ధర్మ పోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ ఏపీని మోసం చేసినవారిని వదిలిపెట్టబోమన్నారు. 'కసిగా ముందుకువెళదాం.. నరేంద్రమోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం..బ్రిటిష్ వారిపైన పోరాడినట్లే బీజేపీ పై పోరాడతా.. మాట నిలబెట్టుకోకుంటే తెలుగువాడి సత్తా, దెబ్బ చూపిస్తాం..' అని చెప్పారు.  బ్రిటిష్ వారికి కొందరు భారతీయులు సహకరిచినట్టే బీజేపీకి కూడా కొందరు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రకు న్యాయం జరుగుతుందని నాలుగేళ్లు వేచి చూశానని, చివరికి ఎన్డీయేకి  గుడ్‌బై చెప్పి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టామని బాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేతలు బొబ్బిలి పులుల్లా పోరాడారని బాబు అన్నారు. 

'యూ టర్న్ నాది కాదు...నాది రైట్ టర్న్...మోడీది యూ టర్న్, రాంగ్ టర్న్' అని బాబు అన్నారు. వైసీపీ ట్రాప్ లో పడ్డానని మోడీ అంటున్నారని.. కానీ వైసీపీ ఉచ్చులో పడింది ఆయనేనని.. ఆ ఫలితాన్ని ఎన్నికల్లో మోడీ అనుభవిస్తారని అన్నారు. '1995 లో సీఎం అయ్యాను..  2002 లో మోడీ సీఎం అయ్యారు. నేను యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఇద్దరిని పీఎంలను చేశా. గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో మోడీ రాజీనామా చేయాలని ఆరోజే చెప్పా. పరిపక్వతపై మోడీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు' అని బాబు అన్నారు.  

పీడీ అకౌంట్స్ గురించి బీజేపీ నేతల విమర్శలపై బాబు స్పందిస్తూ.. '14 ఏళ్లుగా సీఎంగా వున్నాను. దేనికి ఎంత ఖర్చుపెట్టామో దేశంలో ఎక్కడా లేని విధంగా లెక్కలు సిద్ధంగా ఉన్నాయి' అని చెప్పారు. రఫెల్‌ కుంభకోణంలో ఇరుక్కున్న బీజేపీ నేతలు.. తమను విమర్శించడం సరికాదన్నారు.