సమస్యలున్నా.. సంకల్పంతో అధిగమిద్దాం: బాబు

సమస్యలున్నా.. సంకల్పంతో అధిగమిద్దాం: బాబు

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుందామని, సమస్యలున్నా.. సంకల్పంతో అధిగమిద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి హైకోర్టు ప్రాంగణంలో భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 62 ఏళ్ల తర్వాత ఈ గడ్డ నుంచి న్యాయపాలనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. విభజన తర్వాత తొలి చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారు.  హైదరాబాద్ నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు అమరావతి తరలిరావడంతో కళకళలాడుతోందని అన్నారు. ఐతే.. హైదరబాద్ నుంచి తరలి రావడం బాధ కలిగించే విషయమని చెప్పారు. 

నిధులు, ఆస్తుల విభజన వంటివి మినహాయిస్తే ఫిజికల్‌గా అంతా అమరావతి వచ్చేసినట్టేనని చెప్పారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ఇప్పుడు విభజన జరిగాక నవ్యాంధ్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టానని.. ఇదో అరుదైన అనుభవమని చంద్రబాబు అన్నారు. రైతుల సహకారంతో సుందర రాజధానితోపాటు చక్కటి హైకోర్టు భవనాలను నిర్మిస్తామని వివరించారు. హైకోర్టు విధుల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తామని..  చిన్నపాటి ఇబ్బందులుంటే సర్దుకుపోవాలని బాబు కోరారు.