ఇదే మా విజయ లక్ష్యం: బాబు

ఇదే మా విజయ లక్ష్యం: బాబు

ఏపీలో ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తమకు మరోసారి అధికారం వస్తే మరింత మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. లబ్ధిదారులంతా తమ వంతు బాధ్యత తీసుకుని వారికి జరిగిన మేలును చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. నిన్న రాత్రి పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ అయిదేళ్లు కష్టపడ్డానని.. దానికి ఓటు రూపంలో కూలీ అడుగుతున్నానని చెప్పారు. 150 కంటే ఎక్కువ స్థానాల్లో టీడీపీకి గెలిపించాలని కోరిన బాబు.. ఈ సారి ఎవరితోనూ అవగాహన లేకుండా సొంతంగా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు.

మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తానని.. సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా పేదరికమే ప్రామాణికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని ఆయన గుర్తు చేశారు. ఇక.. గతంలో ఒక చోట పోటీచేసిన వారిని అవసరాల రీత్యా ఇప్పుడు వేరే చోటకు మార్చాల్సి వచ్చిందని.. మరికొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఇలాంటి వారందరికీ భవిష్యత్తులో ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ పదవులు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.

వైసీపీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని బాబు స్పష్టం చేశారు. జగన్‌ జుట్టు  మోడీ, కేసీఆర్‌ చేతుల్లో ఉందన్న ఆయన.. తాను ఐదేళ్లుగా ఇక్కడ ఉంటూ పనిచేస్తుంటే జగన్‌ లోటస్‌పాండ్‌లో కూర్చుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నుంచి వచ్చిన డబ్బుతో ఓట్లు కొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని వైసీపీ చూస్తోందని అన్నారు.