ప్లాన్‌ ప్రకారమే దాడులు చేశారు: బాబు

ప్లాన్‌ ప్రకారమే దాడులు చేశారు: బాబు

నిన్న చరిత్రాత్మకమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తనపై నమ్మకం ఉంచి ప్రజలు టీడీపీకి ఓట్లేశారని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పండుగకు వచ్చినట్టు సొంతూళ్లకు వచ్చి ఓటేశారని.. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారని ప్రశంసించారు. సహజంగా పొలింగ్ మొదట్లో మందకోడిగా సాగి పుంజుకుంటుందని.. దీనికి భిన్నంగా ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారని చెప్పారు. ఐతే.. ఈవీఎంలు పని చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు. స్వయంగా సీఈఓనే ఓటేసుకోలేకపోయారని గుర్తుచేశారు.

'ఇప్పుడు జరిగింది ఎన్నిక కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. మోడీ-జగన్-కేసీఆర్ వంటి వారితో పోరాడాల్సి వచ్చింది. ఏపీని టార్గెట్ చేసుకుని నాపైనా.. టీడీపీ పైనా అన్ని శక్తులను ఉపయోగించారు. టీడీపీని టార్గెట్ చేసుకుని కొత్త శక్తులు తెర మీదకు తెచ్చారు. చాలా చోట్ల దాడులు చేశారు. ప్రజలను ఎన్ని విధాలుగా బెదిరించాలో.. అన్ని రకాలుగా బెదిరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే బస్సులను ఆపేశారు' అని చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్న ఆయన.. ఏపీని మరో బీహార్‌లా తయారుచేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.

పార్టీ ఫీడ్ బ్యాక్‌లో కూడా సుమారు 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదని తేలిందని.. ఈవీఎంల వ్యవహారం కొలిక్కిరాగానే హింసను ప్రేరేపించారని ఆరోపించారు. తాము ముందుగా చెప్పినా జాగ్రత్తలు తీసుకోలేదని.. జిల్లా ఎస్పీలను మార్చడంతో హింసను అదుపు చేయలేకపోయారని చెప్పారు. ఈవీఎంలు రిపేర్ చేస్తామని వచ్చినవారు రిపేర్లు చేస్తున్నారా..? ట్యాంపర్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.